Friday 28 August 2020

 // అమ్మ ఒడి //

ఆ విధాత చేతిలో రూపంతో 
అమ్మ ప్రేవుతో జీవంతో 
భువిపై వెలిసిన క్షణంలో 
తనని హత్తుకున్న అమ్మ ముఖంలో 
ఎంత ఆనందం? ఆ బిడ్డకెంత పారవశ్యం?
క్షుద్భాధ తో ఏడిచే వేళ అమ్మ స్తన్యమే 
అమృతభాండంగా 
జోలపాడి నిద్రపుచ్చే వేళ అమ్మ ఒడే 
స్వర్గసీమగా  చిట్టి ఆటలకు అమ్మ ఉత్సంగమే 
మైదానంగా భీతిల్లినపుడు అమ్మ కౌగిలే కవచంగా 
ఊహించే ఆ శిశువుదెంత అదృష్టం? 
గోరుముద్దలు తినే సమయాన 
నింగి విడువని 'మామ'ని పిలుస్తూ 
అడుగులు తడబడు కాలాన 
లోకాన్ని జయించినంత సంతసిస్తూ 
ఆటలాడు తరుణాన అమ్మని చెలిని చేస్తూ 
దోబూచులాడుతూ అమ్మ కానరాని వేళ 
వాడిపోయిన విరుల వలె తను కనబడగానే 
వర్ణరంజిత కుసుమాలను తలపిస్తూ 
తన తల్లిని గాయనిగా , నృత్యకారిణిగా 
ఆటపాటలతో అక్షరాలూ నేర్పించే అమ్మని గురువుని చేస్తూ 
ఆ తల్లి సావాసాన్నే తన లోకంగా భావించే ఆ బిడ్డ 
మోములో ఎంత సంబరం?
అమ్మ చేతిలో బిడ్డకి అమ్మే సర్వస్వం 
ఆ మాతృమూర్తికి ఆ బిడ్డే సమస్తం!!

               // ఆత్మహత్య //

ఎందుకు నీకా నైరాశ్యం? కష్టం,సుఖం చెరి సగం 
చీకటి ఆవలే కదా మరో సూర్యోదయం! విశ్వాసం
సన్నగిల్లి నీకు నువ్వుగా మృత్యువుని ఆహ్వానిస్తే
ఆత్మహత్య కాదది తెలుసుకో నీ వారి మనసు హత్య
నీ పాటికి నువ్వు హాయిగా నిద్రిస్తే నిద్రకరవైన 
రాత్రులెన్నో నీ వాళ్లకి!

కష్టాలే లేని జీవా? ఈ లోకంలో పురాణ పురుషులు   
శ్రీ రాముడు, క్రీస్తు పడలేదా బాధలు , మానవ మాత్రులం 
మనమెంత ?

ప్రేమ విఫలమైతే గుర్తించు తల్లిదండ్రుల ప్రేమ 
అంతకన్నా గొప్పదని ? పరీక్ష పోయిందా 
తెలుసుకో మళ్ళీ ఉత్తీర్ణుడివి కావచ్చని 
ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య లేదు జగతిలో 

జీవంలేని అల ప్రయత్నాన్ని  పరికించు 
ఎన్నిసార్లు పడినా లేస్తుందది తిరిగి నిలబడాలని 
మరి సత్తువ ఉన్న నీవు ఆ మాత్రం ప్రయత్నించవా?
నీలాగే ఎడిసన్ అనుకొనుంటే ఇప్పుడు 
నిశీధిలో వెలుగులు చూసేవారం కాదు కదా!

ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేసి చూడు 
ఓటమే ఎరుగని వారున్నారేమోనని 
అయినా ఓటమే లేని విజయం మోడైపోయిన చెట్టే కదా 

తన మాంసపు ముద్దలతో నీకొక రూపునిచ్చిన అమ్మ, 
లాలించి విద్యా బుద్ధులు నేర్పించిన నాన్న,నువ్వే తమ 
జీవితమని భావించిన నీ భాగస్వామి, నీ పిల్లలు  
తమ ఆశలు తీరుస్తావని ఆశల నావలో విహరిస్తుంటే, 
నడిసంద్రంలో వారిని  వదిలి ఏం సాధిస్తావు? ఆత్మక్షోభ తప్ప!

జీవిత పయనంలో ఓటమి ఒక అవాంతరం మాత్రమే 
అది దాటి గెలుపు గమ్యం చేరుకోవాలే కానీ ఓటమికి 
భయపడి తనువు చాలిస్తానంటే ఎలా ?

నాన్నలేక భవిత కోల్పోయి నీ పిల్లలు కార్మికులై 
తల్లి లేక అందరితో ఉన్నా ఒంటరై , నీవు లేవని నీ తల్లిదండ్రులు
తల్లడిల్లుతూ మానసిక వ్యధ అనుభవిస్తుంటే 
ఈ లోకాన్ని వదిలిన నీవు రావాలనుకున్నా రాలేవుకదా 
క్షణమాగి ఆలోచించు, ఆత్మగా మారక మునుపే 
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సవాలుకే సవాలు విసురుతూ,
నిత్య కృషీవలుడవై నిరంతరాయంగా విజయం తలుపు 
తడుతూనే ఉండు , గెలుపు తీసేవరకు!

       // సంక్రాంతి //


తెలవారని పల్లె వాకిళ్ళలో 
నిశీధి మసకలను చీల్చు భోగిమంటలు 
మనలోని అజ్ఞానాహంకారాలు కాల్చేసి 
జ్ఞానజ్యోతులు ప్రసాదించే కాంతిపుంజాలు 

గుమ్మాలకు బంతిపూల తోరణాలు 
రేగిపండ్ల నీటితో మంగళస్నానాలు 
వీధుల్లో గొబ్బెమ్మలతో అందాల రంగవల్లికలు 
గంగిరెద్దుల కోలాహలాలు హరిదాసుల గానాలు 
కుర్రకారు ఎగరేసే గాలిపటాలు అవి 
అల్లంతదూరాన ఆకాశనౌకలను చేరు విహంగాలు 
చిన్నారుల తలలపై భోగి పండ్లు 
పెద్దవారి కళ్ళల్లో ఆనందభాష్పాలు 
కొత్త అల్లుళ్ళ కొంగొత్త ఆశలు 
ప్రతీ యింట పండగ సందడులు 
రైతులకు భోగభాగ్యాలు 
తొలిపంట చేతికందే ఆనందక్షణాలు
అందరి ఇళ్ళలో సంక్రాంతి సిరులు 
ఇవి మన అచ్చ తెలుగు పర్వదిన పరిమళాలు !!

           // జింక //

హరిత వనాలలో సంచరిస్తూ 
ఆ వనాలకే శోభ తెస్తాయి 
పసిడి మేనితో ప్రకాశిస్తూ 
చూపరులకు కనివిందు చేస్తాయి 
ప్రకృతి రమణీయతకు పులకించి 
చెంగుచెంగున గంతులేస్తాయి
సీతారాములను ఆకట్టుకొని
వనవాస సమయాన తోడయినాయి 
విపత్తులను ముందుగా పసిగట్టి 
మానవాళికి మేలుచేస్తాయి 
గంతులేస్తూ అల్లరి చేసే 
ఆడపిల్లలకు మారుపేరవుతాయి 
తెలుగువారికి రాష్ట్ర జంతువులు 
సాధుజీవులకెల్ల సౌందర్య హరిణులు!!

           //  గోదావరి //

త్రయంబకేశ్వరుడునా'సిక' విడువంగ 
ఝుమ్మని కదిలె గోదావరి 
కందకుర్తినందు తెలుగింట ప్రవేశింపంగ
శ్రీరామ్ సాగరంను నింపె గోదావరి
బాసర వాగ్దేవిని అర్చింపంగ
ఆదిలాబాద్ లో అడుగిడె గోదావరి 
నల్లబంగారపు నేలను తాకంగ
కరీంనగర్ లో కాలిడె గోదావరి
జలగనులతో 'గోదావరిఖని'గ మార్చంగ
తిమిరాలను తరిమె గోదావరి 
ఏటూరునాగారాన ఏరులై పారంగ 
ఓరుగల్లును ఓలలాడించె గోదావరి
కిన్నెరసానిని తనలో కలుపుకొనంగ 
భద్రాద్రి రాముని భక్తితో కొలిచె గోదావరి      
పట్టిసీమకి అందాలు అద్దంగ 
పశ్చిమాన ప్రవేశించె గోదావరి 
పాపికొండలకు సోయగాలు చూపంగ 
తూరుపు వాకిట నిలిచె గోదావరి
రాజమండ్రికి రాజసం కలిగింపంగ
'అఖండము'గా మారె గోదావరి
అన్నదాతకి అభయమీయంగ
దక్షిణగంగగా దర్శనమిచ్చె గోదావరి
అంతర్వేది నృసింహునికి మొక్కంగ
సాగరంలో సంగమించె గోదావరి

   // కోనసీమ //

ఏమని వర్ణించను
గోదారి అందాలను 
పచ్చని పైరులు ఓ  పక్క 
పిల్ల కాలువలు మరో పక్క 
చలువ కొబ్బరి తోటలు ఓ  పక్క 
హొయలతో సాగే గోదారి మరో పక్క 

కోటిలింగాల రాజమహేంద్రి ఓ వైపు 
ఉగ్రనరసింహుని అంతర్వేది మరో వైపు
దక్షిణకాశీ ద్రాక్షారామం ఓ వైపు
సత్యదేవుని అన్నవరం మరోవైపు
కోనేటిరాయుడి 'ద్వారకా' ఓ వైపు
సాంబశివుడి క్షీరారామం మరో వైపు

అటు అందాల రాజోలు 
ఇటు సొబగుల నిడదవోలు
అటు సముద్రుడి సమీరాలు 
ఇటు గోదారమ్మ గలగలలు 
కాదే ఇది భూతలస్వర్గం 
మది దోచే మరోలోకం 
ఏమని వర్ణించను 
కోనసీమ అందాలను 
వర్ణించ మాటలు 
కరవైన సోయగాలను !!  
 

        // హిమాచలం // 

కాశ్మీరాన కమనీయ దృశ్యం
నయన మనోహరం 
పుణ్యనదుల జన్మస్థలం 
పరమానందభరితం 
వేవేల వృక్షజాతుల సమాహారం 
ఔషధగుళికల నిలయం
మైమరిపించే ప్రకృతి సోయగం 
మనోరంజన కావ్యం 
మదిదోచే మహాద్భుత దృశ్యం 
మహర్షుల తపోవనం
ఆహ్లాదపరిచే గిరుల సమాహారం 
అశేష హిమాచలం 
ఎవరెస్టుకు ఎదిగిన ప్రాశస్త్యం 
ఇలలోన కైలాసం 
ఉత్తరదిశన రక్షకకవచం
శ్రేష్ఠమైన 'హిమాలయం' 

 // మంగళయాన్ //

మన నౌక నింగికేగె 
ఆ చంద్రుని చుంబించె 
అంగారక స్పర్శకై ఎగసె 
భరత కీర్తి నలుదిశల వెలిగె 
'మంగళవార'మైతిమి మనం 
అంతరిక్షాన మువ్వన్నెలు రెపరెపలాడె !!

 // ఆకసం చేతికందితే //

అందని ఆకాశం అందితే 
అంబరాన్నే పూలపానుపు చేసిపవళించలేమా  
ప్రతీ ఇంట గుమ్మాలు తారాతోరణాలు కావా 
ముసిముసి నవ్వుల బుజ్జాయిలు జాబిలితో బంతాట ఆడలేరా
మేఘాలను మధించి మంచి వానలు కురిపించలేమా 
హరివిల్లు వర్ణాలతో  లోకమే రంగుల జగతిగా మారదా 
శుభకార్యాలకు పందిరిగా ఆ గగనాన్నే వేయలేమా 
చుక్కలతో వాకిట్లో రంగావల్లికలు పెట్టలేమా 
ఆకసమే దిగి వస్తే 
ఖగోళ శాస్త్రవేత్తలకు పరిశోధనలు పరిహాసమవవా 
అంతరిక్షయాత్రలు ఊహాజనితమవవా
నిరుద్యోగం ఉత్పన్నమవదా  
పాపాయిల అందాల నగవు చూసి ఆ జాబిలే చిన్నబోదా
సుందరీమణుల మిరుమిట్లుగొలిపే నయనాలు చూసి 
ఆ నక్షత్రాలే కాంతివిహీనమవవా 
ఆ రవికిరణ జ్వాలలకు లోకమే భస్మమవదా
ఆ నింగి ఊహలలో అందితేనే మధురానుభూతి
చేతికందితే అనుభూతులే లేవు జగతికి !!
 

 // స్నేహం //

చంద్రుడికి వెన్నెలలా 
భానుడికి కిరణంలా 
కడలికి కెరటంలా 
తారకి జిలుగులా 
మల్లెకి గుబాళింపులా 
ముదిత మోమున బొట్టులా 
తెలుగింటి లోగిలికి అందమైన ముగ్గులా 
అనుక్షణం నీతోనే ఉంటాను 
నేస్తమా! మరువకు నన్నెప్పుడూ 

 // పాడుతాతీయగా //

తెలుగు 'పాట'కుల ప్రోత్సహించ 
మధురంగా పయనమై 
క్రమంగా కాంతులీనుచూ 
మాతృభాష మమకారాల సుడిలో 
లాలిత్య సంగీత మెరుగులద్ది 
నేపథ్యగాయకులనందించి 
తెలియని పదాల అర్ధాలు వివరించ 
బాలుడనని పండితారాధ్యుడే నిర్వహించ 
ఖండాంతరాలు దాటి హాయిగా సాగుతూ 
'ఈనాడు' ఆలపిస్తున్నది 'పాడుతాతీయగా' అని   

 // నువ్వు -నేను //

వసంతం నువ్వయితే  
నే కోయిల గానాన్నవుతా 
దీపమే నువ్వయితే అది 
పంచే వెలుగును నేనవుతా 
నువ్వు పల్లవివయితే 
నే చరణాన్నవుతా 
నువ్వు మేఘానివైతే 
వాన చినుకును నేనవుతా 
నదివే నువ్వయితే 
ప్రవాహాన్ని నేనవుతా 
నువ్వు పయనానివయితే 
మజిలీ నేనవుతా 
అందియవే నువ్వయితే 
సవ్వడి నేనవుతా 
సంగీతం నువ్వయితే 
నే సాహిత్యాన్నవుతా 
హృదయమే నీవైతే 
ఆ గుండె చప్పుడు నేనవుతా !! 

           // తెలంగాణ //

నిరంకుశ నిజాముల పీచమనచగ 
సాధించిన సురాజ్యం మన తెలంగాణ 
కోట్ల గొంతుకలు ఎలుగెత్తి కోరంగ 
సాధించిన స్వరాజ్యం మన తెలంగాణ 
వేలాది వీరుల నెత్తురు నేలరాలంగ 
సాధించిన సురాజ్యం మన తెలంగాణ 
కదం కదం లో లడాయి పడంగ 
సాధించిన స్వరాజ్యం మన తెలంగాణ
బందూకులకు బెదరక ఎదురొడ్డి 
సాధించిన సురాజ్యం మన తెలంగాణ
ఉద్యమంపై ఉక్కు పాదం మోపంగ 
సాధించిన స్వరాజ్యం మన తెలంగాణ 
"జీనా హై తో మర్నా సీఖో" అని జిందగీలిచ్చి 
సాధించిన సురాజ్యం మన తెలంగాణ 
సకల జనం సమ్మెభేరి మోగించంగ
సాధించిన స్వరాజ్యం మన తెలంగాణ 
దోపిడీదారులు లూటీ చేయంగ
మరో రాష్ట్రమే మేలన్నది మన తెలంగాణ 
స్వార్థ నాయకులు సమైక్యమని దగా చేయంగ 
సాధించిన 'ప్రత్యేకం' మన తెలంగాణ 
పారాహుషార్! తెలంగాణ ప్రజలారా 
కావాలె మన తెలంగాణ కోటి రతనాల వీణ !!  

 // మేఘసందేశం //

మేఘమా వర్షించు 
ఆలసించక ఇకనైనా 
నదులు నిగనిగలాడాలని 
నిరీక్షిస్తున్నాయి నీ రాకకై 
చెరువులు చెమ్మగిల్లాయి 
సేద్యానికి సాయం చేయలేమన్నాయి 
బావులన్నీ బావురుమన్నాయి 
నిను పలకరించామన్నాయి 
ప్రాజెక్టులన్నీ 'పవరు' లేక 
పనికిరానివయినాయి 
వ్యవసాయం వ్యర్థమయింది 
రైతన్న జీవితం దుర్భరమయింది 
మేఘమా వినపడలేదా 
అన్నదాత ఆర్తనాదం 
నీకు కనిపించట్లేదా 
చీకట్ల చిద్విలాసం 
వరుణుడా! ఆదేశించు నీ సైన్యాన్ని 
ఇకనైనా గర్జించమని 
మేఘమా కరుణించు 
కరుణించి వర్షించు 
ప్రళయంలా కాదు సుమా 
పరవశించేలా!
విలయంలా గాక 
విత్తనాలు మొలకెత్తేలా 
ఉపద్రవంలా కాదు 
ఊతమిచ్చేలా!
నదులన్నీ నిండేలా 
వరిచేలు పండేలా 
రైతే రాజయ్యేలా 
మేఘమా కరుణించు 
కరుణించి కురిపించు 
నీ అమృతధారలు!

        // లోకబాంధవుడు //

సప్తాశ్వరథంలో సకల లోకాల సంచరించేవు
జగమంతటికీ నేత్రానివి నీవు!
సర్వశాస్త్ర పారంగుతడవే నీవు 
ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడి 
వంశవృక్షానికి విత్తువే నీవు 
సాక్షాత్తు ఆ రామబంటుకి గురువు నీవు!

అనుక్షణం అగ్నికి ఆహుతే నీవు,అయినా 
మాకు వెలుగును పంచే పగటిచుక్కవైనావు!
మనోల్లాస హరివిల్లుకి ఆధారమే నీవు
మా ఆరోగ్య ప్రదాతవే నీవు!

నీ ఒళ్లంతా మంటలే, అయినా పరులకోసం 
బతకడమనే సందేశాన్నిచ్చేవు 
మేఘమాలికలకు నీరందించేవు 
మొక్కలకు ఆహారమే నీవు!

వెన్నెల హాయికి ఆధారమే నీవు
అయినా ఆ కీర్తిని జాబిలికిచ్చేవు
నిరుపమాన త్యాగానికి అర్ధం నీవు
లోకబాంధవా! సాటిలేని ప్రత్యక్ష దైవమే నీవు!

 // భారం కాదు- బాధ్యత నేను //

ఈ పాపం నీదే నాన్న అవును 
నిస్సందేహంగా నీదే!
అమ్మ నేనొస్తున్నానని ఎంత 
సంతోషపడిందో కదా 
అమ్మ దృష్టిలో ఇంటికి యువరాజు 
అయిన అన్నయ్య నేనోస్తే ఆ హోదా 
మాయమని తెలిసి కూడా ఎంత 
సంబరపడి ఉంటాడో ఈ చిట్టి చెల్లెతో 
ఆడుకోవచ్చని? 
నాతో కలిసి గుజ్జన గూళ్ళు కట్టుకోవాలని,
దొంగ పోలీసు, నేల బండ ఆట,ఉయ్యాల 
జంపాల,వీరి వీరి గుమ్మడి పండు ఇంకా 
మరెన్నో ఆటలు ఆడాలని అనుకున్నాడో!
కానీ ఆ పసి మనసుకేం తెలుసు వాడి 
ఆశలు అడియాశాలేనని!
అమ్మయితే మరీనూ నేను రాక ముందే 
లంగా వోణి , జడగంటలు, పాపిట బిళ్ళ,
పట్టీలు, జూకాలు, నా చిట్టి చేతులకు గాజులతో 
నన్ను ఎంత అందంగా ఊహించుకుందో!
వాళ్ళ కలల్ని కల్లలు చేశావు కదా నువ్వు 
అమ్మమ్మయికతే నాకు రోజూ నలుగుపెట్టి 
సున్ని పిండితో తల స్నానం చేయించాలని
ముద్దులొలికే నా మోముకి దిష్టి తగలకుండా 
దిష్టి చుక్క పెట్టాలని ఇంకా ఎన్నో కలలు 
ఆ కలల్ని కల్లలు చేశావుగా నువ్వు 
నన్ను ఎత్తుకొని మురిపెంగా ఆడించాలని,
ఘల్లు, ఘల్లుమనే  శబ్దాలతో నేను ఇల్లంతా 
కలియతిరుగుతుంటే , ఆ సవ్వడులకే 
వేచివున్నానని ఎదురుచూసిన మామ గుండె సవ్వడి 
ఆగిపోయినంత పని అయిందేమో కదా
నేను రాలేనని తెలిసిన క్షణాన!
నీ నిర్ణయాన్ని బలవంతంగా ఆచరణలో పెడ్తుంటే 
అశక్తురాలైన అమ్మ ఎంత ఏడ్చిందో?
నీకు ఒక్కసారైనా గుర్తురాలేదా నాన్నా  
నాయనమ్మ, అమ్మ ఆడవాళ్లేనని?
నన్ను నువ్వు భారం అనుకున్నావు కానీ 
పెద్దయ్యాక నేనే నీ గుండె భారం దించేదాన్నేమో!
బాగా చదివి ఉన్నతంగా ఎదిగి నీ పేరు 
ఊరూరా మార్మోగించేదాన్నేమో
అంతరిక్షానికి దూసుకెళ్ళి నీ పేరు, అమ్మ పేరు 
దేశ విదేశాల్లో వినిపించేదాన్నేమో ఎవరికి తెలుసు?
నా బాధంతా ఒక్కటే నాన్న, నా ఈడు పిల్లలు 
అన్ని రంగాలలో దూసుకెల్తుంటే, అయ్యో నా చిట్టి తల్లిని 
బలితీసుకున్నానే అని నువ్వు బయటికి చెప్పుకోలేక 
లోపల దాచుకోలేక నరకయాతన పడతావేమోనని!
ఎందుకు నాన్న ఇలా చేశావు? అమ్మ కడుపులోనే 
నా రూపాన్ని చిదిమేశావు!
నాన్నా! నీకు తెలుస్తుందా నీ మనసంతా నా రక్తంతో 
తడిసి పోయిందని? వెళ్లి కడిగేయి నాన్న ఆ రక్తపు 
మరకలని, నీలోని మలినాన్ని!
ఊపిరిలూదక ముందే నా ఊపిరి తీసిన నాన్నా నువ్వు 
కచ్చితంగా హంతకుడివే! 
కాదంటావా?
                                          

           // ఉగ్ర గ్రీష్మం //

 వసంతంలో చిగురించిన కొంగొత్త ఆశలు 
తీరాలని ఆశపడుతూ వచ్చే ఋతువు 'గ్రీష్మం'
ప్రచండ భానుడి సెగలు తాళలేక 
రహదారులన్నీ వెలవెల పోతాయి 
జనసంచారం లేని జనారణ్యంలో!
రవికిరణ వేడి భరించలేక మూతపడతాయి 
సెలవనే నెపంతో బడులు, కళాశాలలు 
నవమి జరిపిస్తుంది సీతారాముల కళ్యాణం 
నయనానందకరంగా జగమంతటా!
కోతల కాలంలో తడిసిన దేహాలు అర్రులుచాచి  
వేసవి విడిదికై పరుగులు తీస్తాయి శీతల ప్రాంతాలకు 
సలసలమనే తేనీటికి అలవాటు పడిన జిహ్వ చలువ  
రాగి అంబలి , కొబ్బరి నీళ్ళు అని మారాం చేస్తుంది
పుచ్చ పండ్లు, తాటి ముంజలు, తర్బూజ ఫలాలే 
శరణమంటాయి తడి ఆరని మన గొంతుకలు 
దాహార్తిని భరించలేక పశు పక్షాదులు 
కుళాయిల వెంటపడతాయి కానరాని 'నీటి' జాడకై 
పనిలేక బక్కచిక్కిన రైతన్న ఆశగా ఎదురు చూస్తుంటాడు వర్ష ఋతువుకై!
 
 

      // చందమామ // 

పాలకడలిలో చంద్రోదయం 
శ్రీహరితో సమీప బంధుత్వం 
మైమరిపించే సమ్మోహనరూపం 
ఈ చంద్రదర్శనం!
అద్దంలో నీ కమనీయ వదనం 
రామచంద్రునికిచ్చె బాలానందం 
భుజించననే బుజ్జాయిల మారాం 
మటుమాయం చేయును నీ రూపం 
ప్రభాకరుని బడబాగ్ని కిరణం 
మారి  వెన్నెలనిచ్చు నీ శోషణం 
సౌందర్యమనగానే నీవే స్ఫురణం 
నిశీధిని తెలవారే వరకు నడిపే ధవళ దీపం  
మహ్మదీయుల పవిత్ర మాసానికి నీవే ఆధారం 
వర్ణరంజిత హోళీకి ఆలంబనం నీ పూర్ణబింబం 
ఆధునిక వారం నీతోనే ఆరంభం 
జగమంతటికీ అందేనో, లేదో చంద్రయానం? 
అమరత్వాన్నిచ్చే సుధలో చేశావు స్నానం 
అందుకే మహాదేవుడికి అయినావు మకుటం 
మిణుకుమనే తారల మధ్య నీవే ప్రత్యేకం 
అందుకే మాకు నిన్ను 'మామ' అనేంత సాన్నిహిత్యం!
   

/ జాహ్నవి // 

అలనాడు భగీరథుడు నీకై తపమొనర్చె 
ముక్కంటిని మెప్పించి నిను ఇలకు తెచ్చె 
పుణ్యస్థలి గంగోత్రి నీ జన్మస్థలం 
అలకనంద, భాగీరథిల సంగమమే నీ రూపం 
హరిద్వారున శ్రీహరిని సేవిస్తావు 
ఆపై కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తావు 
ఉత్తరభారతాన ప్రజల దాహార్తిని తీర్చేవు 
వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తావు 
పురాణాలలో నీ పాత్ర అతి పవిత్రం 
మా బాధ్యతలేమితో అయ్యావు అపవిత్రం 
నాడు నీలో స్నానం సర్వపాపహరణం 
నేడు అదే మాకు సర్వరోగకారకం 
కుంభమేళాలతో జగతిని ఆకర్షించావు నాడు 
లోకాన కలుషిత నదులలో చోటు నేడు 
ప్రశాంతంగా ఉంటే నీ పయనమొక మోదం 
ప్రకోపించి ఉత్తరాఖండున మిగిల్చావు ఖేదం 
నాయకులారా! చేతలతో గంగమ్మను ప్రక్షాలించండి 
ప్రజలారా! అవగాహనతో  మెలిగి గంగను రక్షించండి!

  // అమ్మ భాష //

                   
    శాతవాహనుల ఏలుబడిలో విరాజిల్లగా 
    తుళు రాయలు తన మాతృభాష అని కీర్తింపగా 
    తమిళ, కన్నడ కవులు సుందరభాష అని స్తుతించగా   
    పాశ్చాత్య దొరలను సైతం మైమరిపింప చేసినది మన 'అమ్మభాష'!

    భాషలలోకెల్ల మృదు మధురభాష
    నీతి శతకాలనందించిన సుభాష 
    వాగ్గేయకారులు భక్తితో కొలిచిన భాష 
    ఉద్ధండ కవులు లాలించిన భాష 
    ఏడు యాసల అందాల హరివిల్లు ఈ భాష 
    మన భావాలు మరొకరి తీరానికి చేర్చే వంతెన 'మనభాష'!
  
    ఆంగ్లభాష మోహాంధకారంలో మునిగిన తన పిల్లలు 
    అమ్మభాషని నిర్లక్ష్యం చేయగా ఆదరణ కరవైనది మన తెలుగు 
    తెలియజేద్దాం భావితరాలకు ఇది మృతభాష కాదిది మాతృభాషని
    నేర్పిద్దాం తెలుగు ఆటలని, మనదైన సంస్కృతిని
    తెలియజేద్దాం మాతృభాషే మనోవికాస సోపానమని 
    పరభాషలు నేర్పిస్తూనే రక్షించుకుందాం మన అస్థిత్వాన్ని!   

     ఒక ఇంటిలోని సోదరులు వేరుపడగా నేడు 
     ఇరు రాష్ట్రాల అధికార భాష అయినది మన తెలుగు 
     మరవకండి  ప్రజలారా మనం ఒకేగూటి పక్షులమని 
     మన లక్ష్యం, శ్వాస, ధ్యాస తెలుగువెలుగుల కొరకని 
     ఆకాశమే హద్దుగా ఎదుగుదాం పరస్పర సహకారంతో 
     కంకణబద్దులవుదాం తెలుగు కాంతులీనుటకు
     విరివిగా ఉపయోగిద్దాం మన భాషని వాడుకలో  
     నవ పదసంపద సృష్టిద్దాం పరిమళాల తెలుగు పూదోటలో 
     ఎన్ని రాష్ట్రాలున్నా, విదేశానికేగినా తెలుగువారి ఐక్యత చాటుదాం!
      

 // విశ్వమాత //

ఒకచోట జనియించి 
మరోచోటికేతించి 
తనదికాని దేశంలో 
తనవారని తలుస్తూ 
పేదల పెన్నిధి అయ్యి 
రోగులపాలిట కల్పతరువయి 
"నిర్మల హృదయం"తో  
అనాథల పాలిట అమ్మయి
జగమంతటికీ అమ్మయి 
దివికేగిన భారతరత్నమా 
నీవు నిజంగా దేవదూతవే 
విశ్వమాతవే !


       

                  // యుగాది //            

కిలకిలరావాల కోయిలమ్మ స్వాగత సరాగంతో 
చైత్రమాస రథంపై మనోహరంగా ముస్తాబై వస్తుంది 
మోడైపోయిన జీవాలకు కొత్త చివురులు పూయింప 
ఆమని సమీరాల ఆహ్లాదాన్ని తెస్తుంది 
షడ్రుచుల మిళిత రుచిని ఆస్వాదిస్తూ
సుఖ ,దుఃఖాల సారాన్ని తెలియజేస్తూ 
మనోఫలకంపై జీవన సత్యాన్ని అందంగా చిత్రిస్తుంది  
బ్రతుకు బాటలోని అమవసి నిశిని రూపుమాపగ 
ఆశాజ్యోతియై ప్రజ్వలిస్తుంది 
అంతరిక్షాన అష్టగ్రహ కూటమి ఆలంబనగా 
నవవసంతాన 'భవిష్యవాణి' వినిపిస్తుంది 
కాలప్రవాహంలోని మలుపులను ముందుంచి 
సంపద రాకపోకలను, విపత్తులను ఆవిష్కరిస్తుంది 
కోరికల గుఱ్ఱాలపై స్వారీ చేస్తూ తలపుల 
పునాదిపై 'ఆశలసౌధం' నిర్మిస్తుంది ఉగాది!!

         // వసంతోత్సవం //

బృందావనాన గోపికలతో జగన్నాథుడు 
ఆస్వాదించిన క్రీడోత్సవం ఈ 'వసంతోత్సవం'
మానవాళి అంతా సమానమని కుల,వర్ణ 
భేదాలు విడనాడాలని ఆ పరమాత్మ ఇచ్చిన సందేశం!
ఫాల్గుణ మాసాన ఆ శశి నిండైనమనసుతో 
వర్ణరంజితంగా ఆహ్వానిస్తాడు ఈ రంగులకేళిని 
భారతావనిని రంగులమయం చేయడానికి!
చతుర్దశి రాత్రినాడు జరిగే కామదహనం చెపుతుంది 
మనలోని అనుచిత కోర్కెలు దహించుకుపోవాలని! 
తెలియజేస్తాయి వర్ణమయమైన వదనాలు 
బాహ్యసౌందర్యం కాదు అంతఃసౌందర్యం ముఖ్యమని!
మిత్రులారా! ఆలోచించండి హానికారక రంగులెందుకు
ఈ అందమైన ఆటకి? సహజ వర్ణాలు ఉండగా
పర్యావరణ సహిత రంగులనే వాడుదాం
ద్వేషాన్ని, అసూయని వదిలేద్దాం 
శాంతిని ,సౌభ్రాతృత్వాన్ని పెంపొందిద్దాం  
హోదాని గాక మనిషిని మాత్రమే ప్రేమిద్దాం 
అపుడే ఈ వసుధ అవుతుంది రంగులమయం 
అనునిత్యం మమతానుబంధాల హోళీతో!

       //  సోయగాల చైత్రం //

కుహూకుహూల గానామృతంతో 
పికం ఆహ్వానిస్తుంది తొలి తెలుగు మాసాన్ని 
విరించి రచించిన నొసటి రాతలతో 
అఖిల జగత్తు పురుడు పోసుకున్న లావణ్యాన్ని!

మౌనవ్రత ఉద్యాపన గావించిన కోయిలమ్మ పిలుస్తుంది 
కళావిహీనమైన ప్రకృతికి సొగసులద్దుతూ 
వాసంత సమీరాలనందించే మధుమాసపు సౌందర్యాన్ని,
కొత్త శకానికి నాందిగా యుగారంభంతో 
కష్ట ,సుఖాలను విడమరిచే సందేశాల సారాన్ని!

పరితము కిలకిలరాగపు వాయిద్యాలతో 
స్వాగతిస్తుంది రామయ్య పరిణయ వేడుక జరిపే కాలాన్ని 
సోయగాల పుడమి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లెక్కతో 
మంచి , చెడులను ముందుంచే ద్విపక్షాన్ని 
సకల ప్రజల ఆశా నయనాల వీక్షణాలతో 
కోయిలమ్మ రారమ్మంటుంది అందాల చైత్రాన్ని! 

      //అంగడిబొమ్మ// 


నువ్వొక అందాల శిల్పానివి 
నువ్వు ఒక జీవచ్ఛవానివి
నీ తనువంతా గాయాలే 
మనసు తెర చాటున మౌన రోదనలే 
జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు 
చీకటిలో మసకబారిన చేదు నిజాలు 
వంచనగావించబడి కొందరు 
తన వారిని బ్రతుకించ మరికొందరు 
కష్టాల కడలి ఈది అలసి 
పాషాణమైన నీ తనువు, మనసు 
మొత్తానికి నువ్వొక అంగడి బొమ్మవు!!

 // శ్రీరామనవమి //


లోకకళ్యాణానికై శ్రీమన్నారాయణుడే
ప్రత్యక్ష నారాయణుడి వంశమందు 
ఉదయించిన శుభదినం చైత్రశుక్ల నవమి
ఏకపత్నీవ్రతాన్ని జగతికి పరిచయం చేసిన 
ధర్మమూర్తి జననం లేని జానకిని పెళ్ళాడిన పర్వదినం!

చైత్రమాస రథంపై అరుదెంచే వసంతం 
సకలగుణాభిరాముడి మనువుకి ప్రకృతిని అలంకరిస్తుంది 
కొత్త చిగుళ్ళతో, లేలేత పిందెలతో అతి సుందరంగా!
రఘుకులోత్తముడి కళ్యాణాన అందించే పానకం 
ఋతుమార్పులతో దేహంలో ప్రవేశించిన తాపాన్ని 
కరిగింపచేసే అత్యుత్తమ 'శీతల'పానీయం!
లోకాభిరాముడికి జగతిలో పరిణయం 
ప్రపంచం రామరాజ్యమవ్వాలని పంచే సందేశం!
రాజకీయరణం ముంగిట ఈసారి జరిగిన 
కోసలేంద్రుడి వివాహం దేశాన్ని చేసేనో సుభిక్షం?
కోట్లనయనాల ఆశావీక్షణాలను తీర్చునో లేదో కాలచక్రం!

 // అన్వేషణ //

            
నే అన్వేషించా 
నా మనసు నీడకై 
ఇళ్ళలో,వాకిళ్ళలో 
పల్లెల్లో,పట్నాల్లో!  
పొలాల వెంట,
చెరువు గట్ల చెంత 
వెతికా మనిషిని 
మనిషిగా ప్రేమించే వారికై !

నే అన్వేషించా 
కొండలు ,కోనలు 
నదులు, సంద్రాలు  
గాలించా  డబ్బుని 
ప్రేమించని వారికై!

నే అన్వేషించా 
నలుదిక్కులలో 
ధృవాలలోని మంచుపానుపుల్లో 
మానవత్వపు పాదముద్రకై !

నే అలుపెరుగక పయనించా 
దిగంతం దాటి వెదికా 
ఎదురవని మంచితనానికై !
పయనించి పయనించి 
నిరాశ చెందా!
నిరాశలోనూ ఆశతో వెతికా 
మమతానుబంధాలకై !

అలసిన నా కనులు 
మూతపడ్డాయి అచేతనంగా 
అంతలోనే దిగ్గున లేచా 
చుట్టూ గాడాంధకారం!
గుర్తించా అప్పటిదాకా 
నేను స్వప్నంలో ప్రయాణించానని!
క్షణం ఆలోచించి 
జ్ఞప్తికి తెచ్చుకున్నా 
అక్కలు గాని అక్కలని 
అంతర్జాల మిత్రులని 
అలసిన నా మస్తిష్కాన్ని 
జోకొట్టి నిద్రపుచ్చా 
మంచితనం ఇంకా 
మిగిలుందన్న సంతృప్తితో!

    //నవవసంతానికై //


ఏం సాధించింది చైత్రం?
ఏం సాధించింది వసంతం?
ఆకులు రాలే శిశిరానికి వీడ్కోలు పలికి 
పరిణయాల ఫాల్గుణాన్ని సాగనంపి 
తెలుగింట్లోకి వచ్చి ఏం సాధించాయి?
చైత్రవాసంతాలు!

పారిశ్రామికీకరణ పరమావధి అయి 
ప్రపంచీకరణ లక్ష్యమయి నరుడు 
సోయగాల ప్రకృతిని కురూపిని చేస్తుంటే 
ఏం సాధించాలని వచ్చింది వసంతం?
హలం పట్టి, దుక్కి దున్ని,స్వేదాన్ని చిందించి 
అన్నం పెట్టే రైతన్న వానలు లేక చేను ఎండి 
ఓ వైపు దుఃఖిస్తుంటే మరోవైపు 
ఆర్ధికమండలిలంటూ, థర్మల్ ప్లాంటులంటూ 
పచ్చని పైరులను 
బడాబాబులు నీచ నాయకులతో కలిసి 
కబ్జా చేస్తుంటే చేతకాని అన్నదాత 
రక్తాశ్రువులు చిందిస్తుంటే
ఏం సాధించాలని వచ్చింది చైత్రం?
వస్తూనే ఉగాదిని తెచ్చి 
షడ్రుచులని ఆస్వాదిద్దామనుకుంటే 
మన సంస్కృతినీ , భాషనీ కకావికలు చేస్తూ 
విదేశీ సంస్కృతికై వెంపర్లాడుతున్న 
తెలుగువారిని చూసి ఏం సాధించాయి?
చైత్రవాసంతాలు?

హత్యాచారాలు, దోపిడీలు పేట్రేగుతుంటే
న్యాయమనే మాటే అన్యాయమయిన 
నవసమాజంలోకి అడుగిడి
ఏం వెలగబెట్టింది వసంతం?
నిత్యావసర ధరలు 
ఆకాశాన్నంటి సామాన్యుని 
జీవన గమనానికి ఆటంకమవుతుంటే 
ఆ ధరాఘాత ధాటికి సొమ్మసిల్లిన 
మనిషిని చూసి 
ఏం ఉద్ధరించింది చైత్రం?

ప్రజలకే చోటులేని ప్రజాస్వామ్యంలో 
సురమే సాగర కెరటంలా 
సమాజ తీరాన్ని ముంచెత్తుతుంటే 
మానవత్వం, ప్రేమ కరవై
నోట్లకట్టలే నాగరిక ప్రపంచాన్ని 
నడిపిస్తుంటే పిలవని పేరంటానికి 
తగుదునమ్మా అని వచ్చి 
ఏం సాధించింది చైత్రం?
ఏం సాధించింది వసంతం?

మనోహరంగా ముస్తాబై  నా ఎద 
తలుపు తట్టిన చైత్ర వాసంతాలని 
గద్దించి అడిగా ఎందుకొచ్చారని?
మేమే లేకపోతే కోయిల సరాగాలు లేవు 
ప్రకృతి శోభ కానరాదు 
మేమే లేకుంటే నీకు కవితా వస్తువే కరవని 
బదులిచ్చాయి చైత్ర వాసంతాలు!
నిజమే కదూ!

అన్యాయం, అవినీతి అంతమై 
హత్యలూ, మానభంగాలు మటుమాయమై 
దోపిడీలు  దారులు లేనివై  
అన్నదాత అన్నివిధాలా మెరుగై 
సామాన్యుడి జీవితం సుఖమయమై 
పైరులకి హానిలేని పారిశ్రామికీకరణ తోడై 
దేశం సుభిక్షమయ్యేరోజుకై 
నా కలం కదిలింది 
నవవసంత గమ్యానికై !

                              // హిజ్రా //

కురుక్షేత్ర సంగ్రామంలో  మీ జాతి నరుడి ఆగమనం 
కావించెను మహారథి దేవవ్రతునిచే అస్త్ర సన్యాసం 
కలియుగాన కరకు హృదయాల కర్కశత్వం 
చేసెను మిమ్మల్ని ఆధునిక సమాజానికి దూరం !!

కనీస హక్కులు లేని మనదేశ ప్రజలు వారు 
సమాజంచే వెలివేయబడ్డ సంఘజీవులు వారు 
ఆలిని రాత్రి ప్రేమించి పగలు దాష్టీకం చేసే  
నపుంసకులు ఉన్న సమాజంలో వారు అంటరానివారు
నేరం చేయకనే  శిక్ష పొందుతున్న నేరస్థులు వారు !!

ఏ గుర్తింపూ లేని 'ప్రత్యేక' గుర్తింపు కలిగినవారు 
ఛీత్కారాల సత్కారాలు పొందుతున్న శాపగ్రస్తులు వారు 
'పని'కి రావంటూ నిందలు మోస్తున్న పౌరులు వారు 
చేసేదిలేక  అడుక్కుంటున్న ఖరీదైన యాచకులు వారు !!

కూడళ్ళలో , రైళ్ళలో సామాన్యుని వేధిస్తూ పైసలు పోగు చేస్తూ 
బ్రతుకు బండి లాగుతున్న ఆధునిక కూలీలు వారు 
మానవత్వపు మరో ప్రపంచానికై వేచి చూస్తున్న మనుషులు వారు 
మీపై ఎందుకు వివక్ష? మీ ముసుగేసి  దౌర్జన్యం చేసే అభినవ శిఖండులుండగా 
సర్వోన్నత న్యాయస్థానపు సమున్నత తీర్పు తేవాలి మీ భాగ్యరేఖలలో మార్పు! 
// ఏకశిలానగరం// 

రుద్రమ ఏలిన సామ్రాజ్యం 
'వేయిస్తంభాల' వైభోగం
రామప్ప శిల్పకళ సౌందర్యం 
లక్నవరపు అందాల సుమగంధం 
పాకాల ప్రకృతి సోయగం 
కవులకు ఆలవాలం 
కళలకు నెలవయిన దేశం 
భాగవతం జనించిన ప్రదేశం 
ప్రపంచ వారసత్వ నగరం 
అదే మా 'ఏకశిలానగరం'
 

                                 // పైసా//


ధనం నువ్వే కదా మనిషిని నడిపే ఇంధనం 
విద్య, వైద్యం, వ్యాపారం దేనికయినా నీవే శరణం 
గృహప్రేవేశానికి, వధుప్రవేశానికి నువ్వే కదా ఆధారం 
తీర్థయాత్రలకీ, విహారయాత్రలకీ నీవే మూలం 
పంచభక్ష్య పరమాన్నాలకీ , పచ్చడి మెతుకులకీ నీవే ఆలంబనం 
వాత్సల్యానికైనా, గౌరవానికైనా నువ్వే కదా ప్రామాణికం 
అందుకే నువ్వంటే నాకు మోహం !

ధనం నువ్వే కదా బంధాలను చీల్చు సాధనం 
కపటత్వానికీ, కర్కషత్వానికీ నీవే మూలం 
నీవే కదా రక్త సంబంధీకుల రుధిరం చూసే ఆయుధం 
ప్రాణ స్నేహితుల ప్రాణాలు తీసే కాలకూట విషం 
దోపిడీలకీ , దౌర్జన్యాలకీ నువ్వే కదా ఊతం 
అందుకే నువ్వంటే నాకు ద్వేషం !

      // మరో విత్తు //

కాంక్రీట్ జంగిల్ అవతల 
అప్పుడెప్పుడో నేనే బ్రహ్మనై 
నీకు జీవం పోశాను 
నువ్విప్పుడు నాకే అందనంత 
ఉన్నతంగా ఎదిగావు
ప్రేమపక్షులకు ప్రేమావాసమై 
వలస పక్షులకు స్థిరనివాసమైనావు!

నాడు నీ ఆకలి తీర్చమని నా వంక 
బేలగా చూసిన నువ్వు నేడు 
పూటగడవని వాడి ఆకలి తీరుస్తున్నావు!
భాస్కరుడి తీక్షణ వీక్షణాలు మనిషిని 
నిలువునా దహించివేస్తుంటే ఆ తాపాన్ని
చల్లార్చే లేపనమవుతున్నావు!
విషవాయువులను నువ్వు పీల్చి 
మా ప్రాణాలు నిలబెడుతూ 
ఆ గరళకంఠుని తలపిస్తున్నావు 
గ్యాస్ గుదిబండ మోయలేని 
పేదవాడికి ఇంధనం అవుతున్నావు 
నగరీకరణం పేరుతో నీ ఊపిరి తీయాలని 
ప్రయత్నిస్తున్నా మౌనంగా భరిస్తున్నావు!
పదునైన గొడ్డలి దెబ్బకు నీ దేహం 
ఛిద్రమై నువ్వు కార్చే కన్నీళ్ళే 
సంద్రంగా మారి మా పాపాల ఒత్తిడికి 
అది సునామీ కెరటంలా ఈ లోకాన్ని 
ముంచెత్తక ముందే నేను ఏదో ఒకటి 
చేయాలి? ఏం చేయగలను?
మరో విత్తు నాటడం తప్ప! 

                         // కోవెల //

మనిషికి మనశ్శాంతి కలిగించే స్థానం 
ఆధ్యాత్మికత అలవడే ప్రదేశం 
స్వయంవ్యక్తమైనా , ప్రతిష్టితమైనా 
మంత్రోచ్చారణల విశ్వవిద్యాలయం దేవాలయం 
సుప్రభాతం మొదలు పవళింపుసేవ వరకు 
నిత్యం దీప ధూప నైవేద్యాలు , పారాయణాలు 
అలంకరణాభిషేకాలు , యజ్ఞయాగాదులు 
మొక్కుల చెల్లింపులు , ముడుపులు 
కోరికలపై స్వారీ చేసే నరుడిచే దైవానికి విన్నపాలు
అన్నింటికీ అనువైన రంగస్థలం!
ఏకాగ్రత చేకూర్చు గంటానాదం 
దృష్టి దోషాలు తొలగించు మంగళ హారతి 
క్రమశిక్షణ , ఉత్సాహం కలుగజేయు ధ్యానం 
గుడిలో చేసే  ప్రతీ పనికీ కలదు పరమార్థం 
నీ మదిలో రావణున్ని సంహరించి రామయ్యని మేల్కొలిపితే 
ప్రతీ మానవుడి హృదయం కాదా ఒక దేవాలయం !!

                               // వసుధ //


అవనీ! నువ్వే కదా జీవులకి ఏకైక ఆవాస గ్రహం
మంచీ, చెడూ భేదం చూపని మాతృ హృదయం
ఉన్నవారు,లేనివారు అని నీకు లేదు తారతమ్యం
సర్వమతాలనూ అక్కున చేర్చుకున్న సమానత్వ ప్రతీకం
ఎన్నెన్నో అందాలతో అలరారే సోయగాల నిలయం!
గుండెల్లో గునపాలు దించినా పంచుతావు 'జలామృతం'
శరీరం ఛిద్రమయినా అందిస్తావు నివాసాలకి ఊతం
నీపై నడిచి నిన్ను హూనం చేస్తున్నా వహిస్తావు మౌనం
బాంబు దాడులతో భీతిల్ల చేసినా చూపేవు సహనం
రసాయన ఎరువులతో నిన్ను చేస్తున్నాం నిస్సారం
కర్బన ఉద్గారాలతో నువ్వు అవుతున్నావు కలుషితం
వృక్ష వినాశానంతో అవుతున్నావు అగ్నిగోళం
అభివృద్ధి పేరిట జరుపుతున్నాం నీ అందాల విధ్వంసం
విపత్తులతో అవుతున్నాము అతలాకుతలం
ఇకనైనా మేల్కొని సేంద్రియ వ్యవసాయం చేద్దాం
కర్బన ఉద్గారాల వాడకాలు నియంత్రిద్దాం
అటవీ సంపదను విస్తృతంగా పెంపొందిద్దాం
పరిరక్షించుకుందాం పుడమి తల్లినీ, భావితరాలను!!
 

                           // అగ్ని //

దశరథుడికి సాక్షాత్కరించి అగ్ని ఒసగె వరం 
రావణ సంహారంతో  జరిగె  లోకకళ్యాణం
చక్రధారి చేతిలోని 'సుదర్శనం' అగ్ని ప్రసాదం 
లయకారుడి ప్రత్యేక నేత్రం అగ్నికణాల సమూహం!! 

అనాది నుండి సృష్టి ,అగ్నిలది విడదీయరాని బంధం 
సాక్షాత్తు ఆ ప్రత్యక్ష్య నారాయణుడే ఒక మండే గోళం
ఉల్కాపాతం,పర్వత విస్ఫోటనం అంతా జ్వాలామయం  
అణ్వస్త్ర ప్రయోగాలు ,క్షిపణి పరీక్షలు అగ్నితోనే ప్రారంభం 
శుభకార్యాలలో, యాగాలలో తప్పదు అగ్ని ప్రజ్వలనం
మంగళ హారతికైనా , కాష్టానికైనా ఉండేది నిప్పు కణం!! 

వాడుకభాషలోనూ అగ్నిది ప్రత్యేక స్థానం 
నిరంకుశత్వాన్నితరిమికొట్టును విప్లవాగ్ని 
అజ్ఞానాన్ని పారద్రోలేది చైతన్యాగ్ని
కదనరంగాన ఉండేది పౌరుషాగ్ని 
ఆత్మసాక్షాత్కారం ఒక జ్యోతి స్వరూపం
అగ్ని అంటేనే జ్ఞానానికి సంకేతం!!