Friday 28 August 2020

 // అమ్మ ఒడి //

ఆ విధాత చేతిలో రూపంతో 
అమ్మ ప్రేవుతో జీవంతో 
భువిపై వెలిసిన క్షణంలో 
తనని హత్తుకున్న అమ్మ ముఖంలో 
ఎంత ఆనందం? ఆ బిడ్డకెంత పారవశ్యం?
క్షుద్భాధ తో ఏడిచే వేళ అమ్మ స్తన్యమే 
అమృతభాండంగా 
జోలపాడి నిద్రపుచ్చే వేళ అమ్మ ఒడే 
స్వర్గసీమగా  చిట్టి ఆటలకు అమ్మ ఉత్సంగమే 
మైదానంగా భీతిల్లినపుడు అమ్మ కౌగిలే కవచంగా 
ఊహించే ఆ శిశువుదెంత అదృష్టం? 
గోరుముద్దలు తినే సమయాన 
నింగి విడువని 'మామ'ని పిలుస్తూ 
అడుగులు తడబడు కాలాన 
లోకాన్ని జయించినంత సంతసిస్తూ 
ఆటలాడు తరుణాన అమ్మని చెలిని చేస్తూ 
దోబూచులాడుతూ అమ్మ కానరాని వేళ 
వాడిపోయిన విరుల వలె తను కనబడగానే 
వర్ణరంజిత కుసుమాలను తలపిస్తూ 
తన తల్లిని గాయనిగా , నృత్యకారిణిగా 
ఆటపాటలతో అక్షరాలూ నేర్పించే అమ్మని గురువుని చేస్తూ 
ఆ తల్లి సావాసాన్నే తన లోకంగా భావించే ఆ బిడ్డ 
మోములో ఎంత సంబరం?
అమ్మ చేతిలో బిడ్డకి అమ్మే సర్వస్వం 
ఆ మాతృమూర్తికి ఆ బిడ్డే సమస్తం!!

               // ఆత్మహత్య //

ఎందుకు నీకా నైరాశ్యం? కష్టం,సుఖం చెరి సగం 
చీకటి ఆవలే కదా మరో సూర్యోదయం! విశ్వాసం
సన్నగిల్లి నీకు నువ్వుగా మృత్యువుని ఆహ్వానిస్తే
ఆత్మహత్య కాదది తెలుసుకో నీ వారి మనసు హత్య
నీ పాటికి నువ్వు హాయిగా నిద్రిస్తే నిద్రకరవైన 
రాత్రులెన్నో నీ వాళ్లకి!

కష్టాలే లేని జీవా? ఈ లోకంలో పురాణ పురుషులు   
శ్రీ రాముడు, క్రీస్తు పడలేదా బాధలు , మానవ మాత్రులం 
మనమెంత ?

ప్రేమ విఫలమైతే గుర్తించు తల్లిదండ్రుల ప్రేమ 
అంతకన్నా గొప్పదని ? పరీక్ష పోయిందా 
తెలుసుకో మళ్ళీ ఉత్తీర్ణుడివి కావచ్చని 
ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య లేదు జగతిలో 

జీవంలేని అల ప్రయత్నాన్ని  పరికించు 
ఎన్నిసార్లు పడినా లేస్తుందది తిరిగి నిలబడాలని 
మరి సత్తువ ఉన్న నీవు ఆ మాత్రం ప్రయత్నించవా?
నీలాగే ఎడిసన్ అనుకొనుంటే ఇప్పుడు 
నిశీధిలో వెలుగులు చూసేవారం కాదు కదా!

ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేసి చూడు 
ఓటమే ఎరుగని వారున్నారేమోనని 
అయినా ఓటమే లేని విజయం మోడైపోయిన చెట్టే కదా 

తన మాంసపు ముద్దలతో నీకొక రూపునిచ్చిన అమ్మ, 
లాలించి విద్యా బుద్ధులు నేర్పించిన నాన్న,నువ్వే తమ 
జీవితమని భావించిన నీ భాగస్వామి, నీ పిల్లలు  
తమ ఆశలు తీరుస్తావని ఆశల నావలో విహరిస్తుంటే, 
నడిసంద్రంలో వారిని  వదిలి ఏం సాధిస్తావు? ఆత్మక్షోభ తప్ప!

జీవిత పయనంలో ఓటమి ఒక అవాంతరం మాత్రమే 
అది దాటి గెలుపు గమ్యం చేరుకోవాలే కానీ ఓటమికి 
భయపడి తనువు చాలిస్తానంటే ఎలా ?

నాన్నలేక భవిత కోల్పోయి నీ పిల్లలు కార్మికులై 
తల్లి లేక అందరితో ఉన్నా ఒంటరై , నీవు లేవని నీ తల్లిదండ్రులు
తల్లడిల్లుతూ మానసిక వ్యధ అనుభవిస్తుంటే 
ఈ లోకాన్ని వదిలిన నీవు రావాలనుకున్నా రాలేవుకదా 
క్షణమాగి ఆలోచించు, ఆత్మగా మారక మునుపే 
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సవాలుకే సవాలు విసురుతూ,
నిత్య కృషీవలుడవై నిరంతరాయంగా విజయం తలుపు 
తడుతూనే ఉండు , గెలుపు తీసేవరకు!

       // సంక్రాంతి //


తెలవారని పల్లె వాకిళ్ళలో 
నిశీధి మసకలను చీల్చు భోగిమంటలు 
మనలోని అజ్ఞానాహంకారాలు కాల్చేసి 
జ్ఞానజ్యోతులు ప్రసాదించే కాంతిపుంజాలు 

గుమ్మాలకు బంతిపూల తోరణాలు 
రేగిపండ్ల నీటితో మంగళస్నానాలు 
వీధుల్లో గొబ్బెమ్మలతో అందాల రంగవల్లికలు 
గంగిరెద్దుల కోలాహలాలు హరిదాసుల గానాలు 
కుర్రకారు ఎగరేసే గాలిపటాలు అవి 
అల్లంతదూరాన ఆకాశనౌకలను చేరు విహంగాలు 
చిన్నారుల తలలపై భోగి పండ్లు 
పెద్దవారి కళ్ళల్లో ఆనందభాష్పాలు 
కొత్త అల్లుళ్ళ కొంగొత్త ఆశలు 
ప్రతీ యింట పండగ సందడులు 
రైతులకు భోగభాగ్యాలు 
తొలిపంట చేతికందే ఆనందక్షణాలు
అందరి ఇళ్ళలో సంక్రాంతి సిరులు 
ఇవి మన అచ్చ తెలుగు పర్వదిన పరిమళాలు !!

           // జింక //

హరిత వనాలలో సంచరిస్తూ 
ఆ వనాలకే శోభ తెస్తాయి 
పసిడి మేనితో ప్రకాశిస్తూ 
చూపరులకు కనివిందు చేస్తాయి 
ప్రకృతి రమణీయతకు పులకించి 
చెంగుచెంగున గంతులేస్తాయి
సీతారాములను ఆకట్టుకొని
వనవాస సమయాన తోడయినాయి 
విపత్తులను ముందుగా పసిగట్టి 
మానవాళికి మేలుచేస్తాయి 
గంతులేస్తూ అల్లరి చేసే 
ఆడపిల్లలకు మారుపేరవుతాయి 
తెలుగువారికి రాష్ట్ర జంతువులు 
సాధుజీవులకెల్ల సౌందర్య హరిణులు!!

           //  గోదావరి //

త్రయంబకేశ్వరుడునా'సిక' విడువంగ 
ఝుమ్మని కదిలె గోదావరి 
కందకుర్తినందు తెలుగింట ప్రవేశింపంగ
శ్రీరామ్ సాగరంను నింపె గోదావరి
బాసర వాగ్దేవిని అర్చింపంగ
ఆదిలాబాద్ లో అడుగిడె గోదావరి 
నల్లబంగారపు నేలను తాకంగ
కరీంనగర్ లో కాలిడె గోదావరి
జలగనులతో 'గోదావరిఖని'గ మార్చంగ
తిమిరాలను తరిమె గోదావరి 
ఏటూరునాగారాన ఏరులై పారంగ 
ఓరుగల్లును ఓలలాడించె గోదావరి
కిన్నెరసానిని తనలో కలుపుకొనంగ 
భద్రాద్రి రాముని భక్తితో కొలిచె గోదావరి      
పట్టిసీమకి అందాలు అద్దంగ 
పశ్చిమాన ప్రవేశించె గోదావరి 
పాపికొండలకు సోయగాలు చూపంగ 
తూరుపు వాకిట నిలిచె గోదావరి
రాజమండ్రికి రాజసం కలిగింపంగ
'అఖండము'గా మారె గోదావరి
అన్నదాతకి అభయమీయంగ
దక్షిణగంగగా దర్శనమిచ్చె గోదావరి
అంతర్వేది నృసింహునికి మొక్కంగ
సాగరంలో సంగమించె గోదావరి

   // కోనసీమ //

ఏమని వర్ణించను
గోదారి అందాలను 
పచ్చని పైరులు ఓ  పక్క 
పిల్ల కాలువలు మరో పక్క 
చలువ కొబ్బరి తోటలు ఓ  పక్క 
హొయలతో సాగే గోదారి మరో పక్క 

కోటిలింగాల రాజమహేంద్రి ఓ వైపు 
ఉగ్రనరసింహుని అంతర్వేది మరో వైపు
దక్షిణకాశీ ద్రాక్షారామం ఓ వైపు
సత్యదేవుని అన్నవరం మరోవైపు
కోనేటిరాయుడి 'ద్వారకా' ఓ వైపు
సాంబశివుడి క్షీరారామం మరో వైపు

అటు అందాల రాజోలు 
ఇటు సొబగుల నిడదవోలు
అటు సముద్రుడి సమీరాలు 
ఇటు గోదారమ్మ గలగలలు 
కాదే ఇది భూతలస్వర్గం 
మది దోచే మరోలోకం 
ఏమని వర్ణించను 
కోనసీమ అందాలను 
వర్ణించ మాటలు 
కరవైన సోయగాలను !!  
 

        // హిమాచలం // 

కాశ్మీరాన కమనీయ దృశ్యం
నయన మనోహరం 
పుణ్యనదుల జన్మస్థలం 
పరమానందభరితం 
వేవేల వృక్షజాతుల సమాహారం 
ఔషధగుళికల నిలయం
మైమరిపించే ప్రకృతి సోయగం 
మనోరంజన కావ్యం 
మదిదోచే మహాద్భుత దృశ్యం 
మహర్షుల తపోవనం
ఆహ్లాదపరిచే గిరుల సమాహారం 
అశేష హిమాచలం 
ఎవరెస్టుకు ఎదిగిన ప్రాశస్త్యం 
ఇలలోన కైలాసం 
ఉత్తరదిశన రక్షకకవచం
శ్రేష్ఠమైన 'హిమాలయం'